టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగానే… రేవంత్ కొత్త పార్టీ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు వార్తలు ఎక్కువగా వచ్చాయి. రేవంత్ కొత్త పార్టీని వెనక నుంచి చంద్రబాబు నడిపిస్తున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ సామాజిక కాంగ్రెస్’ పేరుతో కొత్త పార్టీని ఈసీ దగ్గర రిజిస్టర్ చేయించారని కొంతమంది ప్రచారం చేస్తోన్నారు. కాగా.. ఈ ప్రచారాలపై తాజాగా కాంగ్రెస్ స్పందించడం గమనార్హం.
రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్ స్రైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వ్యక్తుల వివరాలను ఏసీపీకి అందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శంకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నట్లు టీపీసీసీ గుర్తించింది.
శంకర్‌తో పాటు మరికొంతమంది వ్యక్తులపై మహేశ్‌కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశారు. ప్రచారం చేస్తున్న వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్ వివరాలను పోలీసులకు సమర్పించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.