Kadiam Srihari: కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ?
తెలంగాణలో తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి వరుస నాయకులు పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.
Kadiam Srihari: తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభర్థి కడియం కావ్య పార్టీని వీడడంతో పాటు ఆమె తండ్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే కాంగ్రెస్‌లో కలువబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై, లోక్‌సభ ఎన్నికల కసరత్తుపై శ్రీహరితో రేవంత్ చర్చించారని.. త్వరలోనే వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగుతుందని, ఆమె సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం కడియం శ్రీహరి హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన నివాసంలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రంలోపు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. ఇంకో వైపు సీనియర్ రాజకియ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సీఎంతో భేటీ అయ్యారు. కె కేశవరావు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.