భారత రాష్ట్ర సమితి దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలు బాల్క సుమన్, హన్మంతు షిండే, జోగురామన్న నాందేడ్‌లో పర్యటిస్తూ అక్కడి నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను సమన్వయం చేస్తున్నారు.
తాజాగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పర్యటిస్తూ నాందేడ్ సభలో బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా మహారాష్ట్ర వాసులను వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించారు. బీఆర్ఎస్తోనే రైతులకు, పేదలకు మంచి జరుగుతుందని, తెలంగాణలో ఈ వర్గాలకు ఇప్పటికే లబ్ధి జరుగుతోందని వారికి వివరించారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని కిన్వట్లో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేపశవ్యాప్తంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా కిణ్వట్లో ప్రజలు ఇంద్రకరణ్‌రెడ్డికి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను తమకు కూడా అమలు చేయాలని కోరారు.