సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట్రంలో దారుణ పరిస్థితికి నిదర్శనం అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారికే భద్రత లేదన్నారు. రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. తనలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే వెంటనే 100 నంబర్‌కు డయల్ చేయాలని స్మితా సబర్వాల్ అంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం 100 పైపర్స్ అంటున్నారని సెటైర్లు వేశారు. సీఎం కార్యాలయంలో పని చేసే అధికారికే భద్రత లేదని మండిపడ్డారు.
రెండు రోజుల క్రితం రాత్రి 11.30 వేళ ఓ హోటల్ యజమానిని తీసుకుని కారులో స్మిత సబర్వాల్ ఉండే గేటెడ్ కమ్యూనిటీకి డిప్యూటీ తహశీల్దార్ వెళ్లాడట. సెక్యూరిటీ సిబ్బందికి డిప్యూటీ తహశీల్దార్ అని చెప్పి, స్మిత మేడమ్‌ను కలువాలి అని చెప్పాడట. ఇంటికి వెళ్లి తలుపు తట్టగా, డోర్ తెరిచిన అధికారి గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో షాకయ్యారు. ‘ఎవరు నువ్వు? ఎందుకొచ్చావని ప్రశ్నించారు. గతంలో మీకు ట్వీట్ చేశానని, ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పడంతో మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లాలని అరిచారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
‘అర్ధరాత్రి తనకు భయానక అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ధైర్యంగా నన్ను నేను రక్షించుకున్నా. అందుకే ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రిపూట తలుపులు, తాళాలను చెక్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలి’ అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.