CBI : ఎంపీ అవినాశ్ రెడ్డికి మళ్లీ నోటీసులిచ్చిన సీబీఐ
సీబీఐ అధికారులు మరోసారి అవినాశ్ కు నోటీసులు జారీ చేసింది. మే 19న విచారణకు రావాలని ఆదేశించింది.సీబీఐ నాలుగు రోజులు గడువు ఇవ్వటంతో అవినాశ్ రెడ్డి హైదరాబాద్ (Hyderabad) నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు. అవినాశ్ దారి మద్యలో ఉండగానే సీబీఐ ఆయనకు వాట్సాప్ ద్వారా 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని సీబీఐ (CBI)అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ స్పందించింది.హైదరాబాద్ (Hyderabad) నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి బయల్దేరగా.. దారి మధ్యలో ఉండగా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. వివేకా హత్య కేసు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు సీబీఐకి లేఖ రాసిన అవినాశ్ రెడ్డి.. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని చెప్పారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు.మాజీమంత్రి వివేకా హత్య కేసు(Viveka murder case)లో అవినాశ్ రెడ్డి అనుమానితుడిగా సీబీఐ ఆరోపిస్తోంది. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు అవినాశ్ రెడ్డి యత్నించారని సీబీఐ ఆరోపిస్తోంది. అదే సమయంలో హత్య జరిగిన సమయంలో నిందితులు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సీబీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈకేసు విచారణ ముందుకు వెళ్లాలంటే ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)లను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వెంటనే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. అయితే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఆయన తెలంగాణ (Telangana) హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.