Temperature:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8, 9 అయితే చాలు.. భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దీంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఒక ఎండలే కాదు.. వడగాలులు కూడా వీస్తున్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కన్నా 5,6 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయని భారత వాతావరణ శాఖ (imd) తెలిపింది. ప్రకాశం జిల్లా తర్లుపాడులో 46.05 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లాలో 45.98, ప్రకాశం జిల్లా మద్దిపాడులో 45.96, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.84 డిగ్రీలు, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 45.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వాయవ్య దిశ నుంచి తెలంగాణ (telangana) రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కన గల జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. సాయంత్రం ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు.