హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ లో రాజుగా అజ్మత్ పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీలు హాజరయ్యారు. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్ అధికారిక ప్రకటన వెలువడించింది.
నిజాం చివరి వారసుడు ప్రిన్స్‌గా పేరొందిన ముకర్రమ్ జా వారం రోజుల కిందట మరణించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ఆయన కుమారుడు అజ్మత్ జాను వారసుడిగా ఎంపికయ్యారు. రాజుగా ఎంపికైన అజ్మత్ జా 1960లో జన్మించాడు. లండన్‌లో ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. ఫొటోగ్రఫీపై ఉన్న అభిరుచితో ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందారు. హాలీవుడ్లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్బర్గ్, రిచర్డ్ అటెన్‌బరోలతో కలిసి అజ్మత్ జా పనిచేశారు. వీటితోపాటు పలు లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు. ఆయన ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నా తన వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణల కోసం వివిధ దేశాల్లో పర్యటిస్తుంటారు.
నిజాం సంస్థానానికి సంబంధించిన వ్యవహారాలను ఇకపై అజ్మత్ జా చూసుకోనున్నాడు. నిజాం ఆస్తులు, ఇతర వ్యవహారాలను అజ్మత్ పర్యవేక్షించాలి. ప్రస్తుతం నిజామ్ ఆస్తులు పలు వివాదాల్లో కొనసాగుతున్నాయి. కుటుంబసభ్యుల విబేధాలతో ప్రస్తుతం కొన్ని న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నాయి.