తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం (Hindi SSC paper leak case) వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది. ఈ ప్రశ్నాపత్రం కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్ ల పైన మంగళవారం హన్మకొండ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేసులో మరింత విచారణ కోసం ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ తో పాటు ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేష్ లను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు ఈ నెల 6వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బండి సంజయ్ కు బెయిల్ వచ్చింది. దీంతో ఏ5 నిందితుడు శివగణేష్ ను తమ కస్టడీకి అప్పగించాలని సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ రెండు కస్టడీ పిటిషన్ల పైన హన్మకొండ జిల్లా ఫోర్త్ అడిషనల్ మున్సిఫ్ మెజిస్ట్రీట్ కోర్టు ఇంచార్జ్ షేక్ అరీఫ్ వాదనలు విన్నారు. అలాగే ముగ్గురు నిందితులు ప్రశాంత్, మహేష్, శివగణేష్ లకు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ కస్టడీ పిటిషన్ ను జడ్జి డిస్మిస్ చేశారు.
టీఎస్పీఎస్సీ కేసు విచారణ 24కు వాయిదా
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Leakage Case) కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ దన్క వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరం మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ ఎలా చెపుతారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని వాదించారు. సీబీఐ ద్వారా విచారణ జరిపితే నిజాలు వెలుగు చూస్తాయని వివేక్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో దర్యాప్తు జరుగుతున్న సిట్‌పై నమ్మకం లేదన్నారు. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రి ఎలా చెబుతారని, సిట్ దర్యాప్తు చిన్న ఉద్యోగులకే పరిమితం అవుతోందన్నారు. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నట్టు ఈడీ చెబుతున్నందున సిట్ దర్యాప్తు సరిపోదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రశ్న పత్రాల లీకేజీ దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలని వివేక్ కోర్టును కోరారు.
మరోవైపు… ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17మందిని అరెస్ట్ చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. కేసు దర్యాఫ్తు కొనసాగుతోందని, మరో నిందితుడు న్యూజిలాండ్‌లో ఉన్నాడని త్వరలో విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందన్నారు. పరీక్షల నిర్వహణ సంబంధం ఉన్న వారిని పరీక్షలకు అనుమతించారా, నిర్వహణ ఔట్ సోర్సింగ్ బాధ్యతలు ఏ సంస్థకు ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 24 తేదీకి వాయిదా వేసింది.