Apple: టెక్ దిగ్గజం అయిన యాపిల్ కంపెనీకు షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచీల అమ్మకాలపై బైడెన్ ప్రభుత్వం నిషేధం విధించింది. అమెరికాలో న్యూఇయర్ హాలిడే వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్ భారీగా నష్టపోయే అవకాశముంది. వాచీల పేటెంట్ విషయంలో మెడికల్ మానిటరింగ్ టెక్నాలజీ కంపెనీ మాసిమో ఫిర్యాదు ఇచ్చింది. దీని ఆధారంగా యాపిల్ వాచీల దిగుమతిని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఈరోజు యాపిల్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. వాచీల దిగుమతి, అమ్మకాలపై నిషేధాన్ని ఆపాలంటూ యాపిల్ సంస్థ అప్పీల్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
పేటెంట్ వివాదంపై తాము వేసిన అప్పీల్‌పై తుది నిర్ణయం వచ్చేదాకా విక్రయించేందుకు అనుమతించాలని కోరింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్‌లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ అక్టోబరులో నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని తొలగించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో పాటు వీటిని విక్రయించకూడదని అమలు చేసింది. దీంతో కంపెనీ విక్రయాలు 300-400 మిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.