ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే (Zimbabwe) భారీ విజయాన్ని నమోదు చేసింది. హరారే (Harare)వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన రెండో జట్టుగా నిలిచింది. అంతకుముందు టీమ్ఇండియా (Team India) మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే సూపర్ సిక్సెస్‌లో.. వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్ సిక్సెస్‌కు అర్హత సాధించింది జింబాబ్వే. అయితే నేడు(జూన్ 26) యూఎస్ఏ(USA)తో నామ మాత్రపు మ్యాచ్‌లో పోటీ పడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 408 పరుగుల భారీ స్కోరు చేసింది.వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) 101 బంతుల్లో ఏకంగా 21 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 174 పరుగులు సాధించాడు. ఓపెనర్ గుంబీ 78 పరుగులు సాధించగా.. సికందర్ (Sikandar)రజా 48, రియాన్ బర్ల్ 47 పరుగులతో రాణించారు.ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన యూఎస్ఏ 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది.
ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ (USA) బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0.6,9,8,13,0,24,2,21,6,0.బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ముఖ్యంగా టాపార్డర్ దారుణ వైఫల్యం కారణంగా యూఎస్ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జింబాబ్వే సారథి సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.యూఎస్ఏపై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. మేటి జట్లను వెనక్కి నెట్టి.. టీమిండియా (Team India) తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.