వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా (Team India) నేటి నుంచి టీ20 సిరీస్ ఆడనున్నది.టెస్టులు, వన్డేలు ముగియడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టుతో లేకుండానే హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్.. విండీస్(Windies)తో ఢీకొనబోతుంది. నేటి మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా సారథి హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డును సాధిస్తాడు.కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) రెండు వికెట్లు పడగొడితే టీ20 క్రికెట్లో 150 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో 4000 కంటే ఎక్కువ పరుగులు చేసి 150 వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇక, లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి టీ20 క్రికెట్లో నంబర్ బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా ఓ రికార్డు అందుకునే అవకాశముంది.
అతడు మరో 325 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.వికెట్ కీపర్ సంజు శాంసన్ (Sanju Samson) మరో 21 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 6,000 రన్స్ పూర్తి చేసుకుంటాడు. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) మరో తొమ్మిది వికెట్లు పడగొడితే అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల క్లబ్లో చేరతాడు. మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మరో తొమ్మిది వికెట్లు పడగొడితే అంతర్జాతీయ క్రికెట్లో టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. అంతేకాదు ఈ ఘనత అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.