టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ టీమ్ఇండియా పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది డిసెంబర్లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్.. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అయితే గాయంతో కెప్టెన్‌గా తన మొదటి వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలను కూడా ఆలస్యంగా చేపట్టిన విషయం తెలిసిందే. వయస్సు పైబడటంతోపాటు తరచూ గాయాల బెడతతో ఫిట్నెస్ సమస్య రోహిత్‌ను వెంటాడుతున్నాయి. దీంతో యువకుడైన పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉండటం, జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని పాండ్యాకు జట్టు యాజమాన్యం చెప్పినట్లు తెలిసింది. అయితే అతని నాయకత్వ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో పరీక్షించనున్నారు. ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్ ఇన్ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్ఇండియాలో స్థానం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో హార్ధిక్ నేతృత్వంలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.