బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చిక్కుల్లో పడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నోటీసు అందజేశారు.
రోజర్ బిన్నీ కోడలు, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన మయంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఆడే మ్యాచ్లకు మీడియా హక్కులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కలిగి ఉండటమేనని ఆరోపిస్తూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీకి సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ ఈ నోటీసులకు బిన్నీ డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
నవంబర్ 21నే రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేస్తూ లేఖ రాశారు. అఫిడవిట్ ద్వారా డిసెంబర్ 20వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని బిన్నీకి శరణ్ సూచించారు. ‘బీసీసీఐ నిబంధనల్లోని రూల్ 39(2)(బీ) కింద మీపై ఫిర్యాదు అందిందని.. మీరు రూల్ (1) (i), రూల్ 38(2)ను ఉల్లంఘించారని’ శరణ్ తన నోటీసులో పేర్కొన్నారు.