»Andersons Last Match Was Amazing His Cricket Journey Is Inspiring
James Anderson: అండర్సన్ చివరి మ్యాచ్ అద్భుతం.. ఆయన క్రికెట జర్నీ స్పూర్తిదాయకం
ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో అదరహో అనిపించాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివరి టెస్టును విజయంతో ముగించాడు. సాటి ప్లేయర్ల నుంచి ఘన వీడ్కోలు అందుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యాడు.
Anderson's last match was amazing.. His cricket journey is inspiring
James Anderson: ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. విండీస్ బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ లోనూ చతికిలపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేసిన విండీస్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు రెండో ఇన్నింగ్స్ కూడా ఆడే పని లేకుండా విజయం దక్కింది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 371 పరుగులు చేసింది. విండీస్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ యువ బౌలర్ అట్కిన్ సన్ వీర విహారం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్ సన్, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిసి మొత్తం 12 వికెట్లు తీసి విండీస్ పరాజయానికి మూల కారణంగా నిలిచాడు.
చివరి టెస్టు ఆడిన జేమ్స్ ఆండర్సన్ తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసుకోగా… రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆండర్సన్ సాధించిన వికెట్ల సంఖ్య 704కి చేరింది. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ పేరిట ఉన్న 708 వికెట్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. కెరీర్లో 188 టెస్టు మ్యాచ్ లాడిన అండర్సన్.. సచిన్ తర్వాత అత్యధిక టెస్ట్ మ్యాచ్ లాడిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక వికెట్ల విషయానికి వస్తే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అగ్ర స్థానంలో 800 వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ మురళీ ధరన్ ఉన్నాడు. షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 704 వికెట్లు తీసిన అండర్సన్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్ జట్టుకు నాజర్ హుస్సేన్ కెప్టెన్‌గా ఉన్న 2003వ సంవత్సరంలో ఆండర్సన్ అరంగేట్రం చేశాడు. అప్పటికి ఆండర్సన్ వయసు కేవలం 20 సంవత్సరాలే. ఆ సమయంలో ఇంగ్లండ్‌లో మాథ్యూ హొగార్డ్, స్టీవ్ హార్మిసన్, సైమన్ జోన్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న కారణంగా ఆండర్సన్‌కు తక్కువుగా అవకాశాలు వచ్చేవి. 2007లో ఆండర్సన్ దశ తిరిగింది. భారత జట్టుపై ఆడే మ్యాచుల్లో ఆండర్సన్ వీరవిహారం చేసేవాడు. మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి ప్రత్యర్ధులను బెంబేలెత్తించేవారు. వీరిద్దరూ కలిసి 138 టెస్టుల్లో 1039 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు.
అప్పటి వరకు మెక్‌గ్రాత్, షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు. 2010 నుంచి కొన్నేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంది. 2011లో భారత జట్టుపై విజయం 2013, 2015లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు, 2016 సౌతాఫ్రికాను కూడా వాళ్ల సొంత గడ్డపై మట్టికరిపించింది. ఈ విజయాలన్నిటిలోనూ ఆండర్సన్ అద్భుతంగా రాణించాడు. సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లలో కూడా ఆండర్సన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. 106 మ్యాచుల్లో మొత్తం 438 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మురళీధరన్ సొంత గడ్డపై 493 వికెట్లు పడగొట్టాడు.