IND vs ENG 5th Test : ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 700 వికెట్ల క్లబ్లో చేరిన మూడో టెస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది.
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ అండర్సన్(Anderson) కుల్దీప్ వికెట్ తీయడంతో ఈ రికార్డును సాధించారు. దీంతో టెస్టుల్లో ఏడు వందల వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా, మొదటి పేసర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధికంగా శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ 800 వికెట్లు తీసుకోగా, ఆతర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
మురళీధరన్, షేన్ వార్న్‌ల తర్వాత ఇప్పుడు అండర్సన్(Anderson) టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలిచారు. 700 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి పేసర్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులు చేసింది. క్రాలీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం అయ్యారు. మన బౌలర్లు కుల్దీప్ యాదవ్ ఐదు, అశ్విన్ నాలుగు చొప్పున వికెట్లు తీసుకున్నారు. అశ్విన్‌కి ఇది వందో టెస్టు. వందో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన వ్యక్తిగా మంచి రికార్డు సాధించారు. అలాగే డకౌట్ అయిన ప్లేయర్‌గానూ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.