ఐపీఎల్ లో (IPL 23) భాగంగా గుజరాత్ తో (gujarat titans) జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) ఆటగాడు రింకూ సింగ్ (KKR Player Rinku Singh) చివరి ఏడు బంతుల్లో ఆరు సిక్స్ లు, ఒక ఫోర్ తో వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. రింకూ పైన ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు. రింకూ సింగ్ ఆట తీరును ప్రస్తావించకుండా మండే మోటివేషన్ గురించి ఎలా మాట్లాడగలం అంటూ కితాబిచ్చారు. అతని శక్తిని అంతా ఒక సీసాలో నింపి, మన రక్తంలోకి ఎక్కించాలని ఆకాంక్షిస్తూ అంటూ ట్వీట్ చేశారు. రింకూ అద్భుతమైన ఆట తీరు కనబరిచారని, చివరి ఓవర్, మ్యాచ్ ను గెలిపించిన బ్యాటింగ్ గురించి ప్రస్తావించకుండా మండే మోటివేషన్ గురించి ఎలా మాట్లాడగలమని ట్వీట్ చేశారు. డూ ఆర్ డై లాంటి పరిస్థితుల్లో అతని మనసులో ఏం ఉందో తెలుసుకోవాలని ఉందని, అలా బంతిని కొట్టగల మానసిక శక్తి ఎలా వచ్చిందో అన్నారు. ఆ శక్తిని ఒక సీసాలో నింపి, మన రక్తంలోకి ఎక్కించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ పైన నెటిజన్లు కూడా స్పందించారు.
నిన్నటి దూకుడుతో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. రింకు మొత్తంగా 21 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ ముందు గుజరాత్ తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్ తీసిన సంచలన హ్యాట్రిక్ చిన్నబోయింది. మ్యాచ్ అనంతరం రింకూ మాట్లాడారు. తాను ఓ రైతు కుటుంబం నుండి వచ్చానని, తమ కోసం తన తండ్రి ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేసుకున్నారు. తాను కొట్టిన ప్రతి సిక్సర్‌ను తన కోసం త్యాగాలు చేసిన వారికి అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. తన మీద తనకు నమ్మకం ఉందని, గత సీజన్లో లక్నోతో ఆడినప్పటి పరిస్థితి ఇప్పుడు గుజరాత్ మ్యాచ్‌లోను ఉందని చెప్పారు. ఆ షాట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినవే అన్నారు. అయితే, చివరి సిక్సర్ కొట్టేందుకు కొంచెం కష్టపడవలసి వచ్చిందన్నారు. విజయానికి అవసరమైన సిక్సర్‌ను బ్యాక్‌ఫుట్‌పై ఆడాల్సి వచ్చిందన్నారు.