అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా ఉన్నదుబ్బాక నియోజకవర్గానికి 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్ కింద అస్సలే నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కానీ గజ్వేల్ కు 890 కోట్ల రూపాయలు, సిద్దిపేటకు 790 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఖర్చు చేయడమెంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఎస్డీఎఫ్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
మరోవైపు తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న దాంట్లో అసలు నిజం లేదన్నారు. సింగిల్ ఫేజ్ మాత్రమే 24 గంటల కరెంట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతి సహా హైదరాబాద్లో లక్ష గృహాలు పేదలకు నిర్మస్తామని చెప్పిన హామీలు ఇప్పటివరకు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్నితాము ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని కేసీఆర్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.