జాతీయ పార్టీ గల్లీ పార్టీగా తయారవుతోంది. గ్రూపు రాజకీయాలతో సొంత పార్టీనే బజారుకీడిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు. వాళ్ల గ్రూపు రాజకీయాలతోనే వాళ్లే తమ పార్టీని ఓడించుకుంటారనే ఛలోక్తి రాజకీయాల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ లో పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా పార్టీ నాయకులు చేస్తున్నారు. కొత్త ఇన్ చార్జ్ రాకతో మొన్నటివరకు రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి మాట్లాడుకోవడంతో పార్టీలో విబేధాలు సద్దుమణిగాయి.
ఇలా సద్దుమణిగాయో లేదో అనుకుంటున్న సమయంలోనే సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు అలక బూనారు. ఆయనకు కోపమొస్తే ఆపలేం.. జోష్ వస్తే నియంత్రించలేం. గాంధీభవన్ కు శుక్రవారం పార్టీ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వచ్చారు. ఈ సందర్భంగా అందరూ నేతలతో సమావేశమయ్యారు. అయితే ప్రతియేటా మాదిరి రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీని ఈ ఏడాది కూడా వీహెచ్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ఠాక్రేను ఆహ్వానించగా కుదరలేదు. ముందు నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో తాను రాలేనని ఠాక్రే చెప్పారు. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ జోక్యం చేసుకున్నాడు. ఠాక్రే రాననడం.. జూనియర్ అయిన మహేశ్ కుమార్ కలుగజేసుకోవడంతో వీహెచ్ కోపమొచ్చేసింది. మహేశ్ తో వాగ్వాదం జరిగింది.
ఈ ఘటనతో పెద్దాయన అలకబూనాడు. ఆగ్రహంతో గాంధీభవన్ నుంచి వీహెచ్ బయటకు వచ్చేసి చకచకా తన కారెక్కి వెళ్లిపోయాడు. ఇలా వీహెచ్ అలగడం ఇది తొలిసారి కాదు. వీహెచ్ అలక టీ కప్పులో తుఫాను లాంటిది. ఇలా ఉంటది అలా వెళ్లిపోతది. ఏది ఏమైనా వీహెచ్ ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటది. ఆయన మాటలు, చేష్టలు, ప్రవర్తన ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఇప్పుడు అలిగిన వీహెచ్ ఎప్పుడు మామూలు అవుతాడో చూడాలి.