»Ysrcp Leaders Comments Chandrababu And Pawan Kalyan
YSRCP:రంగా పేరు కూడా తలిచే అర్హత మీకు లేదు
వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
YSRCP: ఎక్కడ పేద, అణగారిన వర్గాలు ఆపదలో ఉన్న నేనున్నానంటూ అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుందెవరో అందకీ తెలియాలని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రంగాకు వెన్ను పోటు పొడిచింది.. చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకోవడమే కాదు పేరు కూడా తలిచే అర్హత లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతించదని ఆగ్రహించారు. వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమేష్ నాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్‌కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడుకోవద్దన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులకే ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు.