తెలంగాణ ఆర్టీసీ క్రమంగా గాడీన పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రయాణికులకు రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ రద్దీని తట్టుకుని పకడ్బందీగా సేవలు అందించి ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంది. సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఆర్టీసీ ప్రైవేటు కార్యక్రమాలకు కూడా బస్సులను అద్దెకు ఇస్తోంది. ఈ అద్దెల ద్వారా కూడా భారీగా ఆదాయం లభిస్తోంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభతో ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను సీఎం కేసీఆర్ ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు తరలివచ్చారు. ఈ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున ప్రజలను తరలించింది. ఈ సభ కోసం విస్తృతంగా ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాట్లాడుకుని ఖమ్మం సభకు ప్రజలను తరలించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా ఆర్టీసీకి అదనంగా దాదాపు రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం.
ఆర్టీసీ రోజువారీ లక్ష్యం రూ.15.69 కోట్లు కాగా.. ఈనెల 18వ తేదీన ఏకంగా రూ.18.31 కోట్ల ఆదాయం పొందింది. ఖమ్మం సభకు కార్యాకర్తలను తరలించేందుకు రాష్ర్టవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో బీఆర్ఎస్ నాయకులు బస్సులను బుక్ చేసుకున్నారు. దీంతో ఆర్టీసీకి ఆ రోజు ఆదాయం పెరిగింది. ఇంతస్థాయిలో ఒకేరోజు ఆదాయం రావడం బహుశా ఆర్టీసీకి ఇదే మొదటిసారి కావొచ్చు.
18న వచ్చిన ఆర్టీసీ ఆదాయం జోన్ల వారీగా ఇలా..
– కరీంనగర్ జోన్: రూ.7.76 కోట్లు
– హైదరాబాద్ జోన్: రూ.5.02 కోట్లు
– గ్రేటర్ హైదరాబాద్ జోన్ రూ.4.70 కోట్లు