కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఫైల్స్ లో నవ్వుల పాలయ్యారని కిషన్ రెడ్డి హేళన గా మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన తెలంగాణ పోలీసులను కిషన్ రెడ్డి కించ పరిచేలా మాట్లాడారని అన్నారు.
కిషన్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మూడేళ్ళ లో ఏం చేశారో చెప్పాలని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతలు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ కు సిద్ధమా అని తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.. దానికి సిద్ధమా కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన అన్నారు. బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయం ఎపుడూ చేయలేదన్నారు.
హై కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును సీబీఐ కి అప్పగించడం పై బీజేపీ సంబరాలు చేసుకుంటోందని.. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ని గెలిపించి తప్పు చేశామని సికింద్రాబాద్ ఓటర్లు అనుకుంటున్నారు, వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి కి బుద్ది చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధిలో మాతో కేంద్ర ప్రభుత్వం పోటీ పడాలి తప్ప దిగజారే రాజకీయాలు చేయొద్దని తలసాని అన్నారు.