అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా… ఓ యువతి తుపాకీతో హల్ చల్ చేసింది. కాల్పులతో కలకలం రేపింది.
నాష్‌విల్లేలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చొరబడిన యువతి విద్యార్థులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులతో సహా మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సాయుధురాలిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితురాలు అక్కడే చనిపోయింది. ఈ మారణహోమం మొత్తం 14 నిమిషాల పాటు సాగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పాఠశాల పక్కన ఉన్న మార్గం నుంచి లోపలికి ప్రవేశించిన యువతి.. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు చేరుకొని కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు.
సమాచారం అందగానే వెంటనే రంగంలో దిగిన ఐదుగురు సభ్యుల పోలీసు బృందంపైన యువతి కాల్పులకు తెగబడింది. దీంతో పోలీసు బృందం జరిపిన ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందింది.
నిందితురాలి వద్ద నుంచి రెండు రైఫిల్స్, ఓ హ్యాండ్‌గన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, ఆ మహిళను అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు.