తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు ఎటువైపు వెళ్తున్నాయో, వెళ్తాయో అర్ధం కానీ పరిస్థితి. ఓ వైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌ను తప్పించింది అధిష్టానం. అదే సమయంలో సీనియర్లు రేవంత్‌ను తొలగించాలని చెప్పినప్పటికీ, ఆయననే కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలను ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మధ్యేమార్గంగా ఇరువురిని చల్లబరిచే ప్రయత్నాలు చేసింది అధిష్టానం. ఇంచార్జిని మార్చడం ద్వారా రేవంత్ ఒంటెత్తు పోకడలకు చెక్ చెప్పినట్లుగా భావించవచ్చు. అధిష్టానం జోక్యం తర్వాత, మార్పులు జరిగి, తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు కూడా వేగవంతమవుతున్నాయి.
అయితే రెండు రోజుల క్రితం బోయినపల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ శిక్షణా తరగతులకు కొంతమంది అసంతృప్త సీనియర్లు హాజరు కాకపోవడం, అదే సమయంలో రేవంత్ రెడ్డి అవసరమైతే పీసీసీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ తీరు చూస్తుంటే ఆయన స్వరం తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మాణిక్కం ఠాకూర్‌ను తప్పించడంతో పాటు అధిష్టానం రేవంత్‌కు తలంటినట్లుగా తెలుస్తోంది. సీనియర్లను కలుపుకుపోవాలని సూచించిందని తెలుస్తోంది.
అంతకుముందు రేవంత్ తాను చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచేవారు. కానీ కాంగ్రెస్ శిక్షణా తరగతుల సమయంలో మాత్రం కాస్త తగ్గి, తాను పార్టీ కోసమే పని చేస్తానని, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగించినా తాను వారిని భుజాలకు ఎత్తుకొని, ముందుకు నడిపించేందుకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా వస్తున్న మాణిక్‌రావు ఠాక్రే ఇటీవల రేవంత్‌కు ఫోన్ చేశారు. అయితే సీనియర్లతో మాట్లాడిన అనంతరం షెడ్యూల్ ఖరారు చేస్తానని రేవంత్ చెప్పడం గమనార్హం. అంతకుముందు ఆయన సీనియర్లను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఇప్పుడు తీరు, స్వరం మారిందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడోను ప్రారంభించనున్నారు. సీనియర్లు కొంతమంది చల్లబడినప్పటికీ, అందరి అసంతృప్తి తగ్గనట్లుగా కనిపిస్తోంది. అలాగే, రేవంత్ స్వరం, తీరు కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో మరో ఇరవై రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర నాటికి రేవంత్, సీనియర్లు ఒక్కటవుతారా చూడాలి.