వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో షర్మిలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీతో పొంగులేటి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం గుమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు కూడా హాజరుకాలేదు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఆయనకు పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించారు. పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుంది అని ఇటీవల కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వైఎస్ఆర్ టీపీలో తిరిగి చేరతారా అనే ప్రశ్న వస్తోంది.
కేసీఆర్ మాట తప్పారు?
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఎంతోమంది అడిగిన వినలేదని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా.. తనకు పదవీ మాత్రం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు. అంతకుముందు వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల అభిమానం, దీవెనలను అందుకున్న వారే లీడర్ అని అనడంతో.. ఆయన పార్టీ మార్పు గురించి గుసగుసలు వినిపించాయి. ఖమ్మం జిల్లా వాసులు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందన్నారు.
బీజేపీలో కాదు.. వైఎస్ఆర్ టీపీలో?
పార్టీ మార్పు గురించి తన సన్నిహితులు, అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 10వ తేదీ (మంగళవారం) నుంచి వరసగా సమావేశాలు నిర్వహించారు. వారి అభీష్టం మేరకు పార్టీ మారే ఛాన్స్ ఉంది. బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఏం జరిగిందో తెలియదు.. పార్టీలో చేరికకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తర్వాత వైసీపీలో చేరి, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా పొంగులేటి పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అయినప్పటికీ పదవీ ఇవ్వలేదు. దీంతో తిరిగి వైఎస్ఆర్ టీపీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.