వైజాగ్ నగరంలో శుక్రవారం వైసీపీ అధ్యక్షతన విశాఖ గర్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన నేతలు కూడా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో.. జనసేన కావాలనే తమ కార్యక్రమాలను నాశనం చేయాలని చూస్తోందని… తమ మంత్రులపై దాడులు చేసిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పవన్ ఘాటుగానే స్పందించారు.
ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రిందటే తాము ఖారారు చేశామని, వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమానికి ముందే తమ ప్రోగ్రాం ఖరారు అయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో, మేం ఎక్కడికి వెళ్లాలో కూడా వైసీపీ చెబుతుందా? మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు తమ దగ్గరికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. తాను జనవాణి కార్యక్రమం నిర్వహించుకోడానికి వచ్చానని, మూడు రాజధానుల అంశం అసలు తమ ఎజెండాలో లేదని పవన్ తెలిపారు. తాము ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా? అని ప్రశ్నించారు.
జనవాణి కార్యక్రమాల్లో ఇప్పటివరకు 3 వేల పిటిషన్లు వచ్చాయన్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే ఎలా? అంటూ పవన్ ప్రశ్నించారు. తాము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడానికి రాలేదని, ఎన్నికల్లో పోటీ పోడతామని సూచించారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదన్న వ్యక్తి కిందనే ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. నేరస్తులకు కొమ్ముకాసి ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కేయండి అంటూ పోలీసులను ఉద్దేశించి పవన్ ఆరోపించారు. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ గూండాలకు ఎవరూ భయపడరన్నారు.