TPT: ఏడు చెక్కు బౌన్సు కేసుల్లో బెంగళూరుకు చెందిన డా. సోమసుందర్ రెడ్డికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. డా. బి.చంద్రపాణి వద్ద రూ.31.37 లక్షలు అప్పు తీసుకుని జారీ చేసిన ఏడు చెక్కులు బౌన్సు కావడంతో కేసులు నమోదయ్యాయి.
MNCL: అనుమతి లేకుండా పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ ప్రకటనలో తెలిపారు. SI వివరాల ప్రకారం మంచిర్యాల నుంచి కరీంనగర్ అనుమతి పత్రాలు లేకుండా బొలేరో వాహనాల్లో 12 పశువులను తరలిస్తుండగా NTR చౌరస్తాలోకి అదుపులోకి తీసుకున్నాం. తొగరు మురళి, నారా కిరణ్, చెన్నూరు లక్ష్మయ్య పై కేసు నమోదు చేశామన్నారు.
ASF: హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై CM దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
VKB: గోక ఫసల్వాడ్‌లో హోలీ పండుగను పురస్కరించుకుని కాముని దహనం కార్యక్రమాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఉప సర్పంచ్ చంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్పంచ్ మల్లమ్మ గారు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ పండుగ, గ్రామంలో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.
VSP: నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వన్యప్రాణులు దారి తప్పుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విశాలాక్షినగర్ నివాస ప్రాంతంలో ఒక అడవి జింక సంచరించింది. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం నుంచి ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జింకలు, దుప్పులు వీధి కుక్కల దాడులు, వాహన ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్దున్నారు.
నిన్న చంద్రగ్రహణం కావడంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
VZM: సంతకవిటి మండలంలోని గుళ్ళ సీతారామపురంలో 500 ఏళ్ల చరిత్ర గల సీతారాముల డోలా మహోత్సవం మార్చి 5-7 తేదీల్లో జరుగుతుందని ఈవో మాధవరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఫాల్గున శుద్ధ ఏకాదశి బదులుగా 5 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకుడు బోగాపురుపు ప్రసాదు చెప్పారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ రావు రవీంద్ర తెలిపారు.
కృష్ణా: పెనమలూరు పోలీసులు కానూరులో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆటోనగర్‌లో కొందరు కోతముక్కలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేసి, 9 మంది జూదం ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,10,690ల నగదు, పేకముక్కలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
VZM: సంతకవిటి మండలం మల్లయ్యపేట-హొంజరాం మట్టి రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. ఈ మార్గంలోనే చింతలపేట, మల్లయ్యపేట, మంతిన, రామ రాయపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
AP: నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు పదమూడో రోజులో భాగంగా ఈరోజు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. APPSC చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్, అగ్నిమాపక సేవా సవరణ బిల్లును హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనున్నారు.
KNR: నేడు జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర గణితం-ఏ, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలకు బోర్డు అధికారులు ‘సెట్-సి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. జమ్మికుంటలోని 3 కేంద్రాల్లో మొత్తం 692 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 441 మంది జనరల్, 251 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుడారాల పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మార్చి 5 నుంచి 8 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ పోర్ట్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పండగ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్ల్ తాజ్ కృష్ణ హోటల్ లో ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకున్న ఈ జంట, నేడు సినీ, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వనుంది. భద్రత దృష్ట్యా అతిథులకు పంపిన వన్ టైమ్ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
SRD: జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈనెల 5వ తేదీన సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు మై భారత్ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. కబడ్డీ మహిళా విభాగం, వాలీబాల్ పురుషుల విభాగం, రన్నింగ్ మహిళ, పురుషుల విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 99853 51111 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.