అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.
PPM: పాలకొండ నగర పంచాయతీలోని శిర్లిపోతన్న ఆలయం వద్ద మంగళవారం జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయం ముందర ఉన్న పోతురాజు విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజలు చేశారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో దేవరపేట నుంచి వెంకమ్మపేట వరకు శిర్లు యాత్ర సందడి నెలకొంది.
KKD: 18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్దిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు.
ATP: శింగనమల నియోజకవర్గ సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం చెరువు ఆధునీకరణ, బీటీ రోడ్డు పనులతో పాటు నార్పల మండల గ్రామాల కోసం హెచ్‌ఎల్‌సీ నుంచి నక్కనూతి కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
SRD: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, కేన్సర్ చికిత్స త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
HYD: ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. యువ ఆపదమిత్ర పథకంలో భాగంగా HYD జిల్లాకు చెందిన 105 మంది యువవాలంటీర్లు వారం రోజులపాటు ఫతుల్ గూడలో హైడ్రా శిక్షణ పొందారు. వారికి ధ్రువపత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల సమయంలో హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా అందుబాటులో ఉండాలన్నారు.
HYD: మియాపూర్‌లోని సాయినగర్‌లో శంకర్(18) అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది పదో తరగతిలో ఫెయిల్ అయిన శంకర్, తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బీదర్ వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
NLG: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. నిన్న హైదరాబాద్‌లోని సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన రిమ్స్ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను గురించి వివరించారు.
GDWL: జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులను మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సన్మానించి, గద్వాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ప్రజల సంక్షేమానికి తమవంతు మద్దతు ఉంటుందని తెలిపారు.
SRPT: అనుమతి లేకుండా ఇసుక రవాణాతో పాటు కూడలిలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులపై, మంగళవారం కూడలిలో ఉన్నటువంటి ఇసుక డంపుల మీద రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.ఈ దాడుల్లో అక్రమంగా నిలువ చేసినటువంటి ఆ డంపులను గుర్తించి 17 డంపులను అధికారులు సీజ్ చేశారు. ఈ డంప్‌లలో ఇసుక సుమారు 202 ట్రక్కులు అవుతాయని అధికారులు తెలిపారు.
VSP: ఆరిలోవలోని జరిగిన హత్య కలకలం రేపింది. భార్య దుర్గ (33) పై అనుమానంతో ఆమె భర్త చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. లైఫ్ స్టైల్‌లో ఉద్యోగం చేసే నిందితుడు, హత్య అనంతరం తప్పించుకోలేక ఇంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే, ఇంటి బయట నిలిపి ఉన్న బైక్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు లోపల వెతకగా అసలు విషయం బయటపడింది.
BHPL: భూపాలపల్లి జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య కృషీవలులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2025-26 కింద మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వై. విజయ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అర్హులైన మత్స్యకారులు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మార్చి 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
KMR: వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు.
VZM: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మెరకముడిదాం మండల కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల అధికారిగా స్దానిక MRO సులోచన రాణి వ్యవహరించారు. మండల అధ్యక్షుడిగా తిరుపతిరావు, ఉపాధ్యక్షుడిగా ఆదినారాయణ, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీలత, సంయుక్త కార్యదర్శి సావిత్రీని ఎన్నుకున్నారు. VRO హక్కుల కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.