NLG: నార్కట్‌పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్డులో లారీ బీభత్సం ఒక నిరుపేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేడి కృష్ణ, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నలుగురు అన్నదమ్ముల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా, ఇప్పుడు కృష్ణ కూడా దూరమవ్వడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
KMR: బిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. బిక్కనూరుకు చెందిన వందన స్కూటీపై మాందాపూర్ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓమ్ని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ తులసీదళార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వర్ణ తులసీదళార్చన అత్యంత వైభవంగా దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సత్యసాయి: నేతన్నల అభ్యున్నతికి, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు. కొద్ది కాలంలోనే రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. రాబోయే ఉగాది పండుగకు మరో విడత బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంలో 85 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. 27వ విడతగా మంజూరైన ఈ చెక్కులు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ATP: అనంత నాగ్ సంగీత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్కేపి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాలు శత గళార్జన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత కళాపరిషత్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ హాజరవుతారన్నారు.
GNTR: చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని చేనేత కార్మిక సంఘం నాయకుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చేనేత పరిరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. GHMCని MIMకు అప్పగించేందుకే మూడు జోన్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ MIMకి మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కాంగ్రెస్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీని దెబ్బకొట్టేందుకే GHMC విడదీశారని తెలిపారు.
SKLM: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందన్నారు.
తిరుపతి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొత్త సీఐ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మద్దయ్యచారి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
BDK: భూదాన్ భూముల్లో నష్టపోయిన ప్రతి బాధితుడిని న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం స్పందించారు. ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. స్థలాన్ని మోసపూరితంగా అమ్మిన వారు జైల్లో ఉంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
AP: అనకాపల్లి కలెక్టర్‌పై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరగాలని, కన్యకాపరమేశ్వరి భూములపై పోరాడుతామని హెచ్చరించారు.
AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని 28వ వార్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను శుక్రవారం తొలగించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీను ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. విద్యుత్ అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.