చిత్తూరు: పలమనేరులో వెంకట్రావు అనే వ్యక్తి సుమారు రూ.14 కోట్లకు ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బాధితులు అంతా కలిసి పలమనేరు సీఐ మోహన్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సీఐ ఇలాంటి అనధికారిక చీటీలు వేయవద్దని ప్రజలకు సూచించారు.
CTR: పుంగనూరులోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు MPDO అప్పాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య రాకుండా రూ.25 లక్షలతో వివిధ గ్రామాల్లో బోర్లు వేస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలో 624 బోర్లు ఉన్నాయని అన్ని పనిచేస్తున్నాయన్నారు. నీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
MDCL: బాచుపల్లిలో దోమల బెడద రోజు రోజుకీ పెరుగుతోంది. సాయంత్రం అయ్యే సరికి కాలనీల్లో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చెరువులు, నిల్వ నీరు, శుభ్రం చేయని డ్రైన్లు సమస్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. డెంగ్యూ భయంతో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫాగింగ్ చేపట్టి పరిసరాల శుభ్రత పై చర్యలు తీసుకోవాలి.
MDK: రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని తెలిపారు.
BHNG: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కె.నరసింహ ఈరోజు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు నిషిద్ధమని స్పష్టం చేశారు.
MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిపన్ను బకాయిలు ఉన్నవారు ముందస్తుగా చెల్లిస్తే వడ్డీ నుంచి ఉపశమనం పొందవచ్చునన్నారు. కావున బకాయిలు ఉన్నవారు సకాలములో బిల్ కలెక్టర్లకు గాని,ఆఫీస్ కౌంటర్లో గాని చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
VKB: తాండూర్ నుంచి హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు బస్సు ఛార్జ్ రూ.160 అదే రైలు ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ రూ. 55 ఉంది. బస్సులో వెళ్లే వారికి తీవ్రంగా కాలయాపన జరుగుతుండగా అదే రైల్లో వెళ్లే వారికి అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. రైలు ఛార్జ్ కేవలం రూ. 55 ఉండి ఉండగా బస్సు ఛార్జీ రూ.160 ఉండటంతో ఉన్నతాధికారులు ఆలోచించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు రత్నం విచ్చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం ఆయనకు అందజేశారు.
W.G: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
BHPL: మహదేవపూర్(M)దుబ్బగూడెంలో సోమవారం రాత్రి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక రైతు పోత సమ్మయ్య ఇంట్లో గుర్తు తెలియని చొరబడి బీరువా తెరిచి 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. కూతురి వివాహం కోసం ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన సొమ్మును కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
AP: తిరుమల వేంకటేశ్వరస్వామికి కాకుండా ఇలాంటి తప్పు వేరే మతంలో జరిగి ఉంటే ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేవారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మిగిలిన మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులు కులాలు కులాలుగా ఉంటారని, అందుకే వైసీపీ నాయకులకు ధైర్యమన్నారు. నెయ్యి కల్తీపై అప్పటి టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని తెలిపారు.
VZM: విద్యార్థులు మంచి ఉపన్యాసకులుగా తయారు కావాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డా. మిరియాల కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం వక్త పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.
SDPT: జగదేవ్ పూర్ మండలం అలీరాజ్పేటలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి, వ్యవసాయ అధికారి వసంతరావు, యువరైతు శ్రీనాథ్ రైతులకు ప్రకృతి సేద్యంలోని మెళకువలను వివరించారు. రసాయన రహిత సాగుతో భూసారం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ కారం శివ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. శ్రీ భవాని కంటి ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు చూపు సమస్యలు, మసక చూపు, కంటి నొప్పులు వంటి సమస్యలను పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారు.