• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలుగు రాష్ట్రాల BJP అధ్యక్షులు భేటీ

ఉభయ తెలుగు రాష్ట్రాల BJP అధ్యక్షులు మాధవ్, రాంచందర్ రావు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహం, అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై విరివిగా చర్చించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఇరురాష్ట్రాల మధ్య సమన్వయంతో కేంద్ర, రాష్ట్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

October 25, 2025 / 10:45 PM IST

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

TPT: మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే SI హరిచందన మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, మృతుడి వయసు 38 ఏళ్లు ఉంటుందని, గ్రే కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.

October 25, 2025 / 09:45 PM IST

రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

TG: RR జిల్లా శేరిలింగంపల్లిలో రూ.86 కోట్ల విలువైన భూమిని హైడ్రా రక్షించింది. రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలంతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 4300 గజాల స్థ‌లాన్ని కాపాడింది. హైడ్రా ప్రజావాణిలో అందిన ఫిర్యాదుతో అధికారులు పరిశీలించి ఆ ఆక్రమణలు తొలగించారు. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.

October 25, 2025 / 09:38 PM IST

నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం: ఉత్తమ్

TG: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో హుజుర్ నగర్ పట్టణంలో 259 కంపెనీలు తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఇవాళ నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 3041 మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. మొత్తం 4574 మందికి ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

October 25, 2025 / 09:22 PM IST

మోదీ నాకు మంచి మిత్రుడు: స్టార్ సింగర్

భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అద్భుతమని US ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ప్రశంసించారు. అలాగే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘భారత్‌కు నాయకత్వం వహించేందుకు రాహుల్ తగిన వ్యక్తి కాదు. భారత ప్రజలు మూడుసార్లు తమ ఓటు ద్వారా మోదీనే ఉత్తమ నాయకుడని తీర్పు ఇచ్చారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

October 25, 2025 / 09:11 PM IST

రామప్ప ఆలయాన్ని సందర్శించిన.. విదేశీయులు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం ఇంగ్లండ్‌కు చెందిన మిచల్ రిచర్డ్, ఎలిజబెత్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ గైడ్ వారికి ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ శిల్ప సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.

October 25, 2025 / 09:08 PM IST

ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

NZB: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. డిచ్‌పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ నగరంలోని వినాయకుల బావి దగ్గర అద్దెకు ఉంటున్నాడు. ఉంటున్న ఇంట్లో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 25, 2025 / 08:59 PM IST

ITDA భవన నిర్మాణానికి స్థల పరిశీల చేసిన కలెక్టర్

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర్ టీఎస్, ITDA పీవో చిత్ర మిశ్రతో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు కొమురం భీం స్పోర్ట్స్ స్టేడియం వద్ద స్థలం అనువైనదిగా గుర్తించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ITDA అధికారులు ఉన్నారు.

October 25, 2025 / 08:57 PM IST

‘ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను బెనిఫిట్స్ వెంటనే అందించాలి’

KNR: రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతుందన్నారు.

October 25, 2025 / 08:55 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ

SKLM: స్థానిక డీసీసీబీ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని శనివారం సాయంత్రం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాల చార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా వేసి సత్కరించారు.

October 25, 2025 / 08:51 PM IST

రాత్రి నిద్ర పట్టడం లేదా?.. ఇలా చేయండి

నిద్రలేమితో ఇబ్బంది పడే వాళ్లకు యాలకులు మంచి పరిష్కారాన్ని చూపుతాయి. యాలకులలో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ నరాల వ్యవస్థను పూర్తిగా రిలాక్స్ చేస్తాయి. వీటి వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ప్రశాంతంగా నిద్రిస్తారు. రాత్రి పూట యాలకులు తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

October 25, 2025 / 08:48 PM IST

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన చిట్యాల వాసి

BHPL: చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా NGO వ్యవస్థాపకుడు డా. రమేష్ ఈ విషయాన్ని ఇవాళ తెలిపారు. 15 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాల కోసం, అంబేద్కర్ ఆశయాలతో సామాజిక సేవలు చేసిన కిరణ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నవంబర్ 5న HYDలో అవార్డు అందజేయనున్నారు.

October 25, 2025 / 08:45 PM IST

పాఠశాల వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRPT: దామకగిద్ద(M)లోని వత్తుగుండ్లలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల వంటగదిని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన వంటగదిని సద్వినియోగం చేసుకోవాలని వంట సిబ్బందికి సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయ బృందాన్ని కోరారు. దీంతో  ఎమ్మెల్యే‌కు గ్రామస్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

October 25, 2025 / 08:45 PM IST

వ్యవసాయ యంత్రికరణ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

WGL: నల్లబెల్లి మండలంలోని రైతులు వ్యవసాయ యంత్రికరణ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బన్న రజిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ టిల్లర్స్ వంటి పనిముట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50% సబ్సిడీ, ఇతరులకు 40% సబ్సిడీ లభిస్తుంది.

October 25, 2025 / 08:45 PM IST

డిజిటల్ భద్రతపై అవగాహన సదస్సు

NRPT: డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించేందుకు నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ.. ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో డిజిటల్ బాధ్యతా భావం పెంచి, సైబర్ భద్రత సంస్కృతిని బలపరుస్తాయని అన్నారు.

October 25, 2025 / 08:44 PM IST