CTR: పుంగనూరు నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2 నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఎల్లమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జాతర సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొమురక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు గుడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
SRCL: చందుర్తి మండలంలో ఇటీవల గెలుపొందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుండి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. మొదటి విడతగా ఈనెల 23 -27 వరకు ఐదు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చందుర్తి రైతు వేదికలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
KNR: గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచ్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ 777, పెద్దపల్లి 706, జగిత్యాల 1065, సిరిసిల్ల 587 కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, నాణ్యతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.
SKLM: పలాసలో ప్రతిపాదిత కార్గో ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ అంశంపై మెట్టూరులో ఆదివారం రాత్రి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. గ్రామ ప్రజలు, భూములు కోల్పోయే రైతులు, మహిళలు, పాల్గొన్నారు. భూమి కోల్పోయే కుటుంబాలకు ప్రత్యేక రక్షణతో పాటు అదనపు రూ. 2.30 లక్షల సహాయం ఇవ్వాలని ప్రతిపాదించారు.
కృష్ణా: మచిలీపట్నంలోని మహతి కళా వేదికలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ జల వాయు కాలుష్య నివారణపై నివేదిక అనే సందేశాత్మక నాటక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి సంరక్షణ, కాలుష్య నియంత్రణపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
RR: షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ పాలన-పంచాయితీ రాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బన్సీలాల్ తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 23 వరకు 4 విడతలుగా శిక్షణ కొనసాగనుందని, వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
AKP: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా విద్యార్థులు తరలిరావడంతో పరిసరాలు కోలాహలంగా మారాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
CTR: సోమల (M) నంజంపేట పోస్టుమాస్టర్ చిదానందంను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆదివారం గుంటూరులో జీడీఎస్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్ సేవకులను సన్మానించారు. వారిలో చిదానందం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.
BPT: నగరంలోని SVRM డిగ్రీ కళాశాలలో ఈ నెల 26వ తేదీన భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,450కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 ఏళ్ల పైబడిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం ఆస్కార్ విజేత, సంగీ దిగ్గజం ఎం.ఎం కీరవాణిని రంగంలోకి దించారు. ఈ విషయాన్ని హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవంతో మొదలై, ఫిబ్రవరి 27న కల్యాణోత్సవం, మార్చి 3న బండ్ల ఊరేగింపు, మార్చి 7న రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం కోసం సీఎంతో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతానని, ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తానని, అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని అన్నారు.