ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం ఆస్కార్ విజేత, సంగీ దిగ్గజం ఎం.ఎం కీరవాణిని రంగంలోకి దించారు. ఈ విషయాన్ని హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవంతో మొదలై, ఫిబ్రవరి 27న కల్యాణోత్సవం, మార్చి 3న బండ్ల ఊరేగింపు, మార్చి 7న రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం కోసం సీఎంతో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతానని, ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తానని, అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని అన్నారు.
కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి, ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉచిత చిన్న పిల్లలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ATP: నార్పలలోని సుల్తాన్‌పేట పెట్రోల్ బంకు వద్ద దొంగలు బరితెగించారు. వడ్డే మహేష్ అనే వ్యక్తికి చెందిన బొలెరో వాహనానికి ఉన్న రూ. 45 వేల విలువైన రెండు టైర్లను అపహరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే రెండోసారి ఇలా జరగడంతో బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. పోలీసులు గస్తీ పెంచి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్‌కు వెళ్లనున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కేటీఆర్ పరామర్శిస్తారు. కష్టకాలంలో తోడుగా ఉంటూ, పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు స్వయంగా జైలుకు వెళ్లి సుమన్‌తో ములాఖత్ కానున్నట్లు సమాచారం.
HNK: ఐనవోలు మండలం పన్నేలు గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా సోమవారం ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్‌ను ఆపి అనుమతిపత్రాలను పరిశీలించినప్పటికీ, సరైన అనుమతులు లేని కారణంగా ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు, ట్రాక్టర్ డ్రైవర్,యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
KMM: అంబేద్కర్ సెంటర్ వద్ద BC, SC, ST జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న రాత్రి స్థానిక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజకులపై జరిగిన దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇంకా తాడులు ఆగలేదని JAC నేత రాంబాబు చెప్పారు.
GNTR: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.
ప్రకాశం: ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
KMR: బాన్సువాడలోని రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాళ్లు విసిరిన ఘటనలో ఇప్పటివరకు 42 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
AP: తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను పాము కాటేసింది. ఆలయ సిబ్బంది వెంటనే భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ నెల సందర్భంగా నర్వ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జామా మసీద్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం భక్తులు తరలవచ్చేలా రంగురంగుల వెలుగులతో మసీదు శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. రాత్రి వేళల్లో మసీదు మెరిసిపోతోంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రత్యేక నమాజ్‌లు నిర్వహిస్తున్నారు.
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శంభునిపేట కాలనీలోని వాటర్ ట్యాంక్‌ను నిన్న రాత్రి నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అంతరాయం లేకుండా సరఫరా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఉన్నారు.
NZB: వర్ని మండలం అక్బర్ నగర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్- లారీ ఢీకొన్న ఘటనలో పాత వర్నికి చెందిన భూమయ్యకు గాయాలయ్యాయి. వర్ని 108 సిబ్బంది రామకృష్ణ, గౌస్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.