భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)కు తెలంగాణతో (Telangana) విడదీయరాని బంధం ఉంది. ఆయన హైదరాబాద్ (Hyderabad)కు పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ తో రాష్ట్రానికి ఉన్న అనుబంధం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి నిజాంను (Nizam) ఒప్పించిన వారిలో అంబేడ్కర్ ఒకరు. దేశానికి రెండో రాజధానిగా (Second Capital) అంబేడ్కర్ ప్రతిపాదించాడు. ఇక ఆయన రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైంది. మరి అంతటి గొప్ప కలిగిన అంబేడ్కర్ తో హైదరాబాద్ కు ఉన్న అనుబంధం తెలుసుకోండి.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ (Mir Osman Ali Khan)తో అంబేడ్కర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రమొచ్చాక హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయాలని కోరిన వారిలో అంబేడ్కర్ కూడా ఒకరు. విలీనం ద్వారా రాజ ప్రముఖ్ (Raj Pramukh) అనే గౌరవం లభిస్తుందని నిజాం రాజును అంగీకరించారు. లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు అంబేడ్కర్ వెళ్లగా.. వాటికి అయిన ఖర్చులన్నింటిని నిజాం ప్రభుత్వం భరించింది.
– 1932 సెప్టెంబర్ 3న తొలిసారిగా అంబేడ్కర్ హైదరాబాద్ లో కాలు మోపాడు.
– నిజాం ప్రభుత్వ 72వ సమావేశంలో పాల్గొన్నారు.
– 1942లో ఒకసారి రాగా.. 1944లో హైదరాబాద్ లో జరిగిన ఎస్సీ ఫెడరేషన్ మహాసభకు అంబేడ్కర్ హాజరయ్యారు. ఆ మహాసభలో చేసిన ప్రసంగం చారిత్రాత్మకంగా నిలిచింది.
-1952లో మరోసారి అంబేడ్కర్ హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ కు రాగా పెండర్ గాస్ట్ రోడ్డులో నాటి ఎంపీ జేహెచ్ సుబ్బయ్య ఇంట్లో అంబేడ్కర్ బస చేశారు.
– 1953లో చివరిసారి మన నగరానికి అంబేడ్కర్ వచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అంబేడ్కర్ కు అందించి సత్కరించింది. అంబేడ్కర్ కు మొదట గౌరవ డాక్టరేట్ ఇచ్చిన తొలి వర్సిటీ మన ఓయూనే.
హైదరాబాద్ పై అమిత ప్రేమ
ఢిల్లీలో ఉన్నా అంబేడ్కర్ హైదరాబాద్ పై అమిత ప్రేమ కనబర్చేవారు. అందుకే దేశానికి రెండో రాజధానిగా ఎంపిక చేయాల్సిన ప్రాంతం ఏదైనా ఉంటే అది హైదరాబాద్ అని అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’లో హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలని ప్రతిపాదించారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన రాజ్యాంగ ప్రకరణ 3 ద్వారా నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అందుకు కృతజ్ణతగానే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు.