ఓటును ఎవరూ అమ్ముకోవద్దని, ఇది అంబేడ్కర్ సిద్ధాంతాలకు (ambedkar) వ్యతిరేకమని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు (tdp leader yanamala ramakrishnudu). తూర్పు గోదావరి జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల కోసం ప్రత్యేక చట్టాలను చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. అయితే నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారయ్యాయని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దాడులకు పాల్పడిన పాలకులే ఇప్పుడు అంబేడ్కర్ కు దండలు వేస్తున్నారన్నారు. సమ సమాజం, నవ సమాజం ఏర్పడాలంటే దళితులకు ప్రాధాన్యత ఉండాలన్నారు.
అంబేడ్కర్ కేవలం భారత దేశానికే కాదని, ఆయనను ప్రపంచ దేశాలు కూడా లీగల్ పండిట్ గా, రాజ్యాంగ నిర్మాతగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా గుర్తిస్తున్నాయన్నారు. ఆయన సామాజిక ఉద్యమం చేశారన్నారు. సమాజంలో మార్పు వస్తే తప్ప సమసమాజ నిర్మాణం ఏర్పడదని భావించి, రాజ్యాంగంలో అందుకు అనుగుణంగా పొందుపరిచారన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు, అలాగే దళితులకు ప్రాధాన్యత ఉండాలని ఆయన చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అందుకే రిజర్వేషన్లు వచ్చాయన్నారు.