సత్యసాయి: హిందూపురంలో మార్చి 15న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సప్తగిరి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో 100కు పైగా బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని తెలిపారు.
NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ASR: జీకేవీధి(మం) సీలేరు ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, గంజాయి రవాణా నియంత్రణతో పాటు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ విడిచి పెట్టారు.
ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొలిపుర ప్రాంతంలో 7.5 క్వింటల్లా రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. చిలుకూరి లక్ష్మీ నగర్‌కు చెందిన నిందితుడు షేక్ ఇమ్రాన్ అహ్మద్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
NZB: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
T20 WC ఫైనల్ పోరు భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఈ టోర్నీలోనే బలమైన జట్టుగా ఉందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా ఫైనల్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శరత్ నేతృత్వంలో శుక్రవారం కన్నారెడ్డి, జప్తి జానకంపల్లి తండాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 6 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణ బాలుర, బాలికల పాఠశాలలో చదువుతున్న 31 మంది అనాధ, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు పరీక్ష కిట్స్ అందజేశారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ ఏఈ స్వప్న సహకారంతో విద్యార్థులను గుర్తించి కిట్స్ అందజేసినట్లు వివరించారు.
KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ భవనంతో గ్రామ సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
ADB: ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న గురుకుల పాఠశాల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కో-ఆర్డినేటర్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అంగన్వాడి కార్యకర్త ఉస్తెలమూరి విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందింది. 24 సంవత్సరాలుగా గ్రామంలో పనిచేస్తూ గర్భవతులకు, బాలికలకు, చంటి పిల్లలకు సేవలు అందించారు. అందరి ఆదరాభిమానాలను సంపాదించుకున్నారని గ్రామస్థులు అన్నారు. విజయలక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. దీంతో ఒమన్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌లెట్, మాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఐ వీరేంద్రబాబుకు సూచించారు.
VZM: దత్తిరాజేరు(మం) షికారు గంజి ఏపీ మోడల్ స్కూల్లో 2026-2027 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి శుక్రవారం తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు www.apms.apcfss.in వైబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.