NLG: గట్టుప్పల్ మండలంలో బెల్ట్ షాపులు, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంజీవరెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల వరకు బైండోవర్ చర్యలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF సెంటర్‌లో పొడి వ్యర్థాల వర్గీకరణ తీరును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
MHBD: తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన నేతావత్ రవి అనే వ్యక్తి నిన్న పాడి గేదెలకు నీళ్లు తాగించేందుకు ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లగా, ప్రమాదవశాత్తు అదే వాగు గుంతలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.
W.G: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబుని కలసి చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో, మారుమూల ఉండటం వలన సరైన ప్రయాణ సాధనాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం అందుకు అవసరమైన చర్యలు చేపడతామని కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు.
ATP: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారానికి చెందిన నిరుపేద నంచర్ల రాము కుమార్తె ఉమ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.
AP: YS వివేకా హత్య కేసుపై CBI కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు MP అవినాష్ సహా మిగిలిన నిందితులు హాజరయ్యారు. నిందితులకు 13 లక్షల ఫైల్స్ ఉన్న హార్డ్‌డిస్క్‌లను CBI అందజేసింది. హార్ట్‌డిస్క్‌లో కొన్ని ఫైల్స్ ఓపెన్ కావట్లేదని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు మార్చి 9కి వాయిదా వేసింది.
WNP: వనపర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మిడిదొడ్డి మాధవి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్, నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
SRPT: తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.
W.G: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారని అన్నారు.
SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శుక్రవారం భూమి పూజా చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆలయ నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నగేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరిన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నూతన పాలకవర్గం శాలువతో సత్కరించి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ వెంట ఉండి ముందుకు నడిపించడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది.
NRML: తానూరు మండలంలోని దాగం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారుతో మాట్లాడి గ్రావెల్ రోడ్డు మంజూరు చేయించారు. ఇందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు విఠల్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
BHPL: జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.5 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్) రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఏసీబీని ఆశ్రయించారు.
VZM: కొత్తవలస మండల రెవెన్యూ అధికారిణిగా ఎస్. రామలక్ష్మీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోమవారం లేదా గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆ స్థానంలో విధులు నిర్వహించిన అప్పలరాజు జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
MNCL: రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు తాండూర్ మండలం అచ్చలాపూర్ ZPHS విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో హర్షిత బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయిందన్నారు. ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో హర్షిత పాల్గొంటుందన్నారు.