KMR: కామారెడ్డిలో నేడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
ASF: ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా, 13 మంది BRS నాయకులపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.
E.G: గోదావరి సెంట్రల్ డివిజన్ ధవళేశ్వరం సర్కిల్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ MLC రాజశేఖర్ సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఆయన సీఎంకు వినతిపత్రం అందజేశారు.కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరారు.
ADB: రేవంత్ అన్న కా సహారా-మిస్కినో కే లియే పథకం కింద ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిన్న ఇంటర్వ్యూల కార్యక్రమం చేపట్టారు. ఈ పథకం కోసం మొత్తం 67 మంది దూదేకుల, ఫకీర్ కమ్యూనిటీలతో పాటు సామాజికంగా వెనుకబడిన ముస్లింలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక చేస్తామని తెలియజేశారు.
SS: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మూడు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఊరిచింతల గ్రామాల్లో 293 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: సీఎం చంద్రబాబు తల్లిదండ్రులపై అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి మండిపడ్డారు. రైల్వే కోడూరులో సోమవారం ఆయన మాట్లాడారు. చట్టం తన పని తాను చేస్తోందని, కక్షసాధింపులు లేవని స్పష్టం చేశారు.
ASF: త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైనర్, డ్రంక్&డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్సులు రద్దు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటారు.
KNR: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వన్ టౌన్ కార్నర్ వద్ద సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేనివి, ఫ్యాన్సీ, అస్పష్టంగా ఉన్న 43 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.
MNCL: బెల్లంపల్లిలో BJP క్రమక్రమంగా పుంజుకుంటోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కొక్కేర రామ్మూర్తిని ఆయన కలిసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
KDP: వితంతువులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సింహాద్రిపురం MPDO శ్రీనివాసరావు తెలిపారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ఆప్షన్ ఓపెన్ కాలేదనే సోషల్ మీడియా వార్తలు అవాస్తవమని, ప్రజలు ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. వితంతువులు విడో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
SRCL: సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారక రామ్ నగర్ కాలనీకి చెందిన కడవేరు కనకవ్వ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ: వృత్తిపరమైన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా విశాఖ ఏఎన్ఐ ప్రతినిధి బి. శివరామకృష్ణను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇకపై రక్షణ శాఖ అధికారిక కార్యక్రమాలకు అనుమతించబోమని డిఫెన్స్ పీఆర్ఓ కమాండర్ సుజిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన్ని అధికారిక గ్రూపుల నుంచి తొలగించామని చెప్పారు.