AP: YCP చీఫ్ జగన్ ఇవాళ్టి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అలాగే ఎల్లుండి వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రజాదర్బార్‌కు హాజరవుతారు.
WNP: పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.
NLR: కర్నూలులో న్యాయవాది పవన్ కుమార్‌పై అక్కడి 4వ నగర పట్టణ సీఐ దాడిని ఖండిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. న్యాయవాదులంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
W.G: నరసాపురంలో అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14వ వార్డుకు చెందిన మహమ్మద్ రెహినాకు, మహమ్మద్ షబ్బీర్ 2021 జూన్ 28న వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు నుంచే భర్త షబ్బీర్, మహమ్మద్ నసీమా, మహమ్మద్ నసీర్, మహమ్మద్ జబీన్, సందీప్ రెడ్డి అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులుల తెలిపారు.
NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. నేడు పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.
NDL: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి 1న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరగనుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.
SRCL: వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 120.4 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. కోల మారుతి అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.55 వేల విలువైన మద్యం సీజ్ చేసి, నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
NRPT: పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన పోష్ చట్టం అవగాహన వాల్ పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. లైంగిక నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
KNR: కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐఐటీఏ శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్‌ను, దాని హ్యాండ్లర్ పీసీఈ రాజును సీపీ గౌస్ అలాం అభినందించారు.
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారీ వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చి చివరి దశలో ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు.
అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని చిన్నవరం పాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు రవి మృతి చెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. సాయంత్రం పొలానికి వెళ్తున్న రవి సైకిల్ అదుపుతప్పి పడిపోగా, వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
TPT: ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ నవ్య ఆటో ఫైనాన్స్‌లో సుమారు రూ. 85 లక్షలు మోసం చేసిన కేసులో యుగంధర్ (33)ను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాహన రుణాల పేరుతో వ్యక్తులను తీసుకువచ్చిన వారి పేర్లపై రూ. లక్ష లోన్ మంజూరు చేయించేవాడు. రూ. 40 వేలు వారికి ఇచ్చి, రూ. 60 వేలు స్వలాభానికి వినియోగించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
MNCL: నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమీక్లో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
MHBD: ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సింగారం దీక్షిత్ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ విజేతగా నిలిచాడు. దీక్షిత్ ప్రథమ బహుమతి, ప్రశంస పత్రం ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో ఎంఈవో రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు విద్యార్థిని అభినందించారు.
KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో తారాదేవి తెలిపారు. నిషేధిత హెచ్ టీ పత్తి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సాగులో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.