Heart Attack : గుండెపోటు మరణాలు ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువయ్యానే చెప్పాలి. ఒకప్పుడు కేవలం 60ఏళ్లు దాటిన వారు మాత్రమే.. హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ... ఈ మధ్య నడి వయసు వారు, 25ఏళ్ల కుర్రాళ్లు కూడా... హార్ట్ ఎటాక్ కి గురౌతున్నారు.
రోజురోజుకీ గుండెపోటుతో మరణించేవారు పెరిగిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ హార్ట్ ఎటాక్ వచ్చేస్తోంది. ఒకప్పుడు హార్ట్ ఎటాక్స్ అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి అని అందరూ అనుకునేవారు. కానీ… ఈ కరోనా మహమ్మారి తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుసపెట్టి యువకులు, యువతులు లతో పాటు చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు..ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు.
తాజాగా గుండెపోటుతో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో బోడ లకపతి, వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బోడ స్రవంతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
శ్రీరామనవవి పండగ సందర్భంగా సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంది. అనంతరం నానమ్మ దగ్గర నిద్రించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడింది స్రవంతి. ఆయాస పడుతూనే నానమ్మను లేపింది. ఆపై గుండెపోటుతో కుప్పకూలింది. సమీపంలోనే ఉన్న బాబాయ్ వచ్చి సీపీఎర్ చేశాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బాలిక కన్నుమూసినట్లు వైద్యుడు తెలిపాడు. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.