తెలంగాణ మంత్రి హరీష్ రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను కన్విన్స్ చెయ్యి అంతే కానీ ఇతర పార్టీల మీద విరుచుకు పడితే మీ స్థాయి పెరగదని హరీష్ రావు పై ఆయన మండి పడ్డారు.
ఇక ఫామ్ హౌస్ లో ఉండే సీఎంను కలిసి కష్టాలు చెప్పుకొనే అవకాశం ఎవరికీ లేదని దేశమంతా ఎస్సై సెలక్షన్ కోసం 3.8 మీటర్ల లాంగ్ జంప్ ఉంటే.. మన దగ్గర మాత్రం 4 మీటర్లు పెట్టారని, మిలటరీలో, ఇతర రాష్ట్రాల్లో కూడా లేని రూల్ ఇక్కడ పెట్టారని అన్నారు. అభ్యర్థుల కళ్ళల్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధ చెప్పుకుందాం అంటే కేసీఆర్ కలవరని, హోమ్ సత్తా ఉన్న మంత్రి కాదని అన్నారు. కేటీఆర్, హరీష్ మీరు కల్పించుకొని ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆయన లేదంటే సరైన సమయంలో మీకు వాత పెట్టడం ఖాయమని అన్నారు.
ఇక ప్రజా ప్రతినిధులు బానిసలుగా మారకండని పేర్కొన్న ఆయన స్థానిక సంస్థల కోసం చట్టం తెస్తే ఆ చట్టాన్ని కెసిఆర్ చట్టుబండలు చేశారని అన్నారు. తిరుగుబాటు చేయండి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావని పేర్కొన్న ఆయన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని అన్నారు. ధరణి సమస్యలు తెచ్చినా, పెన్షన్లు ఆపినా ప్రజలు మౌనంగా భరిస్తున్నారు. వీటన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. బానిసలుగా మారి మామీద అటాక్ చేసే కంటే, జపంచేసే కంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండని ఆయన అన్నారు.