»Covid Cases Expected To Touch 50k Marks In Mid May Predict Iit Kanpur Professor
Covid Cases: మేలో మరింత విజృంభించనున్న కరోనా మహమ్మారి..!
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాచడం మొదలుపెట్టింది. ఈ ఏడాది మే నెలలో మరింత గరిష్టంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరోనా(corona) మహమ్మారి ఇప్పట్లో మన దేశాన్ని వదిలిపెట్టేలా కనపడటం లేదు. రోజు రోజుకీ ఈ వైరస్ వికృత రూపం దాలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు 10వేలు దాటుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత మరణాలు కూడా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించడం మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా రోజువారీ కేసులు ఈ ఏడాది మే నెలలో గరిష్ట స్థాయికి చేరతాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్(IIT Kanpur professor) డాక్టర్ మణీంద్ర అగర్వాల్ అంచనా వేస్తున్నారు.
మే మధ్య నాటికి రోజువారీ కేసులు గరిష్టానికి చేరుకుంటాయని, ఆ సమయంలో రోజువారీ కేసుల సంఖ్య 60 వేల వరకు నమోదు కావచ్చని చెప్పారు. కరోనా కేసుల పెరుగుదలకు ఆయన రెండు కారణాలను వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తొలి రెండు విడతల్లో చాలా మందికి సోకడంతో సహజ రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారడం తెలిసిందే. ఇప్పుడు 5 శాతం మంది ప్రజల్లో కరోనాపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గినట్టు డాక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందడాన్ని రెండో కారణంగా పేర్కొన్నారు.
దేశంలో 90 శాతం మందికి, యూపీలో 95 శాతం మందికి సహజ రోగ నిరోధక వ్యవస్థ ఉన్నట్టు అగర్వాల్ తెలిపారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో కరోనా గరిష్ట కేసులు 50-60వేలు అన్నది ఏమంత పెద్దది కాదన్నారు. చాలా కేసుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నట్టు, దగ్గు, జలుబుకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చన్నారు. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్(covid)ను ఓ సాధారణ ఫ్లూగానే చూడాలన్నారు.