కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా గ్రామాల రైతులు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి రైతులతో అధికారులు చర్చలు జరపాలని, ప్రభుత్వ అధికారులు, మంత్రి కేటీఆర్, కామారెడ్డి కలెక్టర్ నిర్లక్ష్యం వలనే సమస్య జఠిలమైందని అన్నారు. వెంతనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, వారితో పాటు నిరసనలు చేస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండుగా వర్గాలుగా మారి రైతులకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కిసాన్ కాంగ్రెస్ నుండి కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డిల వర్గం ఒక బృందంగా ఏర్పడి రైతులకు మద్దతు ఇవ్వనుండగా, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సీనియర్ నాయకులు మరొక బృందంగా ఏర్పడి కామారెడ్డి వెళ్తున్నారు. కామారెడ్డిలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు పోరాటం చేయనున్నారు. ప్రభుత్వం దిగివచ్చి రైతులతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.