ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తడం సాధారణంగా జరిగే విషయమే. కాగా… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… పార్టీలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… అన్ని పార్టీలకన్నా….. బీజేపీకి ఎక్కువ విరాళాలు రావడం గమనార్హం.
గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ పార్టీకి వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వివిధ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం.. దేశంలో 2021-22 కుగాను బీజేపీకి అత్యధికంగా రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ విరాళాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత రూ.44.54 కోట్ల విరాళాలతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.
ఇదే కాలానికిగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షల విరాళాలు మాత్రమే వచ్చాయి. తర్వాత సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. నిబంధనల ప్రకారం రూ.20,000 కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.