»Bjp Mla Etela Rajender Appears Before Police In Tenth Paper Leak
Tenth Paper Leak : ముగిసిన విచారణ.. ఫోన్ తో హాజరైన ఈటెల
ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు.
Etela Rejender: తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజీ(Tenth Paper Leak) వ్యవహరం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయి..జైలు నుంచి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rejender) నేడు వరంగల్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు. ఈ విషయంలో దర్యాప్తు నిమిత్తం ఈనెల 6న ఈటెలను విచారణకు హాజరుకావాలని పోలీసు(police)లు నోటీసులు పంపించారు. అయితే తనకు ముందస్తుగా షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా 10వ తేదీన విచారణకు వస్తానని సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో నేడు పోలీసుల ముందు హాజరయ్యారు. కాగా ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈటెల పీఏలు రాజు, నరేందర్ లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగా వారిరువురిని స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. అలాగే ప్రశాంత్ హిందీ పేపర్ ను పంపించిన వాట్సప్ గ్రూప్ ల అడ్మిన్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు. అలాగే వారి ఫోన్లను పరిశీలించారు. ఇక విచారణలో ఈటెలకు మహేష్ అనే వ్యక్తి నుంచి పేపర్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈటెల ఫోన్ డేటా(phone data) మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ తమపై ఉద్దేశ్యపూర్వకంగానే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS)కు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.