ఒక్క రాత్రితో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తుండటంతో హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరలేపిందని అన్నారు.
కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు ఆ స్వామీజీని పిలిపించుకున్నారని, అక్కడే ఈ డ్రామాకు సంబంధించి స్ర్కిప్టు రాసుకున్నారని, దానిని ఇప్పుడు హైదరాబాద్‌లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రామాతో తమకు సంబంధంలేదని సీఎం యాదాద్రిలో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ తరపున ఎవరు రమ్మంటే వాళ్లు వస్తారని, ప్రమాణం చేస్తారని, సీఎం వచ్చి ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.
సీఎం కనుసన్నల్లోనే ఈ డ్రామా అంతా నడిచిందని, ఇంతకు ముందు మంత్రిపై హత్యాయత్నం పేరుతో కొన్ని డ్రామాలాడారని, అది బెడిసికొట్టడంతో ఇప్పుడు ఈ డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్‌లో జరిగిన విషయాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మునుగోడుకు చెందిన ఓ నాయకుడు గత మూడు రోజులుగా డెక్కన్ కిచెన్‌లో మకాంవేశారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు ప్రతిరోజు ఉదయం ప్రగతిభవన్‌కు వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకుండా ఎలా వదిలేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. స్వామీజీ, నందకుమార్, ఎమ్మెల్యేల కాల్ డేటాను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.