టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేల(mlas) కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… తాజాగా.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తాజాగా ఓ ఆడియో లీక్(Audio leak) కలకలం రేపింది. ఈ ఆడియోలో రామచంద్ర భారతి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడినట్లు స్పష్టంగా అర్థమౌతుంది.
రామచంద్ర భారతిని ఎమ్మెల్యే స్వామిజీ అంటూ మాట్లాడారు. నందుతో మాట్లాడిన అంశం పైన వారిద్దరూ చర్చించారు. అసలు ఎంత మంది వచ్చే అవకాశం ఉందని అడగ్గా, ప్రస్తుతానికి తనతో పాటుగా మరో ఇద్దరు ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. పేర్లు కోరగా, ఇప్పుడే చెప్పలేనంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. గ్రహణం అయిన తరువాత తాము హైదరాబాద్ వస్తామని, అక్కడ నేరుగా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామని స్వామిజీ చెప్పుకొచ్చారు. అదే సమయంలో సంతోష్ అనే నేత పేరు ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది.
రోహిత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్, సెక్యూరిటీ అన్నింటి పైన నందూ హామీ ఇచ్చారని చెప్పగా, తామే మొత్తం బాధ్యత తీసుకుంటామని స్వామిజీ చెప్పటం ఆడియోలో స్పష్టం అవుతోంది. నందూ తమను ఒత్తిడి చేస్తున్నాడని చెప్పగా, నందూ తప్పులేదని.. ఆయన పైన ఒత్తిడి ఉందని రామచంద్ర భారతి వివరించారు.
అదే సమయంలో ఎమ్మెల్యే తమ సీఎం గురించి తెలుసుకదా, తమ పేర్లు బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుందని స్వామిజీతో చెప్పారు. నెంబర్ 1, నెంబర్ 2 సంతోష్ ఇంటికి వస్తారని, అక్కడ ప్రోటోకాల్ ఆ స్థాయిలో ఉంటుందని స్వామిజీ చెప్పటం ఆడియోలో స్పష్టంగా ఉంది. విషయం బయటకు రానీయద్దంటూ రోహిత్ అదే సంభాషణలో స్వామిజీని కోరుతారు.
తాను అనారోగ్యంతో ఉన్న కారణంగా తరువాత సమావేశం అవుదామని చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు తమ వైపు నుంచి సిద్దంగా ఉన్నారని, మిగిలిన వారి కోసం ప్రయత్నం చేస్తానని రోహిత్ చెప్పుకొచ్చారు. 3వ తేదీ న జరిగే ఎన్నికలోగానే ఈ ప్రక్రియ పూర్తి కావాలంటూ రామచంద్ర భారతి చెప్పటం ఆడియో లో స్పష్టంగా ఉంది. సహకరించిన వారి బాధ్యత తాము అన్ని రకాలుగా చూసుకుంటామని స్వామిజీ హామీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో మరిన్ని వీడియోలు – ఆడియోలతో సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.