దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగుతుండగా తెలంగాణలో మాత్రం వాడీవేడిగా జరిగాయి. మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గణతంత్ర వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. రాజ్ భవన్ లో జెండా వందనం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫామ్ హౌజ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్ భవన్ కాస్త రాజకీయాలకు కేంద్రంగా మారిందని.. గవర్నర్ ఒక రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుతిమెత్తగానే గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘కరోనా వంటి ఆపత్కాల సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని మేం డిమాండ్ చేశాం. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు’ అంటూ కవిత ట్వీట్ చేశారు. నొప్పించక తాను నొప్పకుండా కవిత గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ తీరు రోజురోజుకు వివాదస్పదమవుతోంది. పవిత్రమైన రాజ్ భవన్ లో ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.