భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను వీరిద్దరు పరామర్శించారు. అన్నీ అందజేసినప్పటికీ, కారు నుండి తీసిన రూ.4 వేలు ఇవ్వడం మరిచిపోయామని, ఇప్పుడు తెచ్చిచ్చినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దమానీ కూడా మ్యాక్స్ హాస్పిటల్‌ను సందర్శించారు. పంత్‌కు అందిస్తున్న వైద్యం, సదుపాయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. పంత్ తల్లి సరోజ్ పంత్, సోదరి సాక్షిలతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని ఆయన తెలిపారు.
గత శుక్రవారం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన పంత్‌కు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ అయింది. ముఖం మీద అయిన గాయాలకు డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం కాస్త కోలుకున్నాక ఆయనను ఇంటెన్సివ్ కేర్ నుండి ప్రయివేటు వార్డుకు తరలించారు. ప్రమాదం జరగడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఎక్స్‌రేలలో రిషబ్ పంత్ కుడికాలు ఫ్యాక్చర్ కావడం, నుదుటి భాగంలో చిట్లిన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అలాగే మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. అంతా సాధారణంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ముఖం మీద మాత్రం మైనర్ సర్జరీ చేశారు.