దేశంలో 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. కాగా… నాటి నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆ నిర్ణయానికి సంబంధించి సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆర్బీఐని ఆదేశించింది.
నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. నోట్ల రద్దు నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రం ఆర్బీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. నోట్ల రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
నోట్లు రద్దైపోయి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారని వివరించారు. నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ చట్టంలోని 24,26 చట్టాలను పరిశీలించాలని కోరారు. ప్రత్యేక చట్టం ద్వారా 1978లో నోట్ల రద్దు చేపట్టారని, కానీ 2016లో మాత్రం అలా ఏ చట్టాన్ని రూపొందించలేదని గుర్తు చేశారు.