పశ్చిమ బెంగాల్ (West Bengal)లో జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీ కుంభకోణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి (Trinamool Congress -TMC) భారీ షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా (Jiban Krishna Saha) అరెస్టయ్యాడు. సీబీఐ (Central Bureau of Investigation -CBI) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణం కేసులో అరెస్టయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కుంభకోణంలో కోల్ కత్తా (Kolkata) హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సాహా మాణిక్, భట్టాచార్య, పార్థా చటర్జీని అరెస్ట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జిబాన్ కృష్ణను కూడా విచారించిన సీబీఐ నేడు అదుపులోకి తీసుకుంది. సీబీఐ దూకుడుతో పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి (Mamata Banerjee) భారీ షాక్ తగిలింది.
మూడు రోజులు 65 గంటల పాటు విచారణ అనంతరం జిబాన్ కృష్ణను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ లోని ఎమ్మెల్యే నివాసంలో అతడిని అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విచారణ సందర్భంగా ఇంట్లో జిబాన్ వాష్ రూమ్ కు వెళ్లాడు. అక్కడి నుంచి బయట ఉన్న చెరువులో తన రెండు ఫోన్లను పడేశాడు. కాగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో మరికొన్ని అరెస్ట్ లు ఉండనున్నాయని తెలుస్తోంది.